Monday, 9 March 2015

89.అనుపమ- కవితల సంపుటి నా స్పందన

కవి శ్రేష్ఠులు..... మాధవ రావు గారికి (మీ కవిత్వం లోని ఉచ్ఛ స్తాయిని అనుభ వించిన తరువాత) నమస్సులు .. మీ "అనుపమ కవితల సమాహారం" చదివాను . మీ ప్రతి కవితలోనూ పల్లె పదనిసలు, మీ మదిలో పొందిన ఆర్తి, హృదయ స్పందనలు కనిపిస్తున్నాయి. మీ కవిత్వం గురించి నేను వ్యాఖ్యా నించడానికి నాకున్న ఒకే ఒక అర్హత - రైతు బిడ్డను కావడం మాత్రమే .. ప్రతి కవితలోనూ నన్ను నేను చూసుకొన్న .. ఎన్నో ఏళ్ళ జీవిత సారాన్ని మదించి మట్టి వాసన లా మాకు అందించారు. మీకు నా హృదయ పూర్వక అభినదనలు. పుస్తకం చదివిన తరువాత నాకు కలిగిన అనుభూతులను ఇక్కడ పొందు పరచాను.

నగరంలోని ఉరుకుల పరుగుల జీవితంలో ముసుగుల ముఖాలను వారు చేస్తున్నకార్యాలను అత్యంత సహజత్వంతో వర్ణించిన వైనం (అనుపమ); మట్టిని దాని ప్రస్తుత ముఖ చిత్రాన్ని చిత్రీకరించిన విధానం (దుఃఖ ధూళి); నేను చేస్తున్న పనిలోనే సంతోషం అనే విషయాన్ని అంతర్లీనంగా చెప్తూ ఎంతో చక్కగా వ్యక్తీకరించిన నిజం (దిగులు); యాత్ర ఏదైనా మనిషి పొందే ఆర్తి అటు పిమ్మట వీడ్కోలు లోని విరాగం (ఒకానొక వీడ్కోలు కోసం); రైతు - వ్యవసాయం - యుద్ద మైన సేద్యాన్ని గుర్తు తెస్తూ ఉటంకించిన హాలికుని ఆక్రందనల పర్వం మట్టి కోసం అలసట లేని జననం (పునరుపి జననం);    ఆధునిక పోడు .. ఎంతటి గొప్ప వర్ణన .. కవి తత్త్వం పతాక స్తాయికి చేరిన విషయం (రేపటిలోకి); కంది చేల వయ్యారం బాల్యంలో కాంచిన కవి గారి చమత్కార విన్యాసం ఆధునిక కాలంలో కంది పోయిన విధానాన్ని సక్షాత్కారింప చేసిన విధానం (కంది పోయాం).

 పట్టనీకరణ వలన పలచన అయిన పల్లె దైన్యాన్ని కళ్ళెదుట నిలబెట్టి నికార్సుతనం (వలస పక్షుల గూళ్ళు); తరలి పోతున్న, క్షీణిస్తున్న అటవీ సంపద చాటున దాగిన వ్యధా భరిత ఇజాలు (ఆకు రాలిన అడవి); గులక రాయిలా మారిన కొండలు, మారిన గులకలు రోడ్లుగా మారుతున్న వైనం, ద్వంస మవుతున్న ప్రకృతి ఇలా అన్ని విషయాలు స్పృశించిన వైనం (నడక కష్టంగా); పంట పొలాల ద్వంసం, రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలనుంది వారి తుచ్చ రాజకీయాల స్వచ్చమైన పంటకు అన్వయించి చెమర్చిన జీవితం (ఆకాలం); సొల్లు కబుర్ల ప్రస్తుత కాలాన్ని ఉటంకిస్తూ భవి ష్యత్ మీద భరోసా తో మొదలు పెట్ట మని (ఇప్పుడే, ఇప్పుడే); అక్షరాల కుప్పల్లో కవి తన శుద్దత్వాన్ని ఆవిష్కరించిన కవన కదనం (వెంటాడని వాక్యం).
   
దుఖం- ఘర్షణ -కరచాలనం - పయనం ఇలా సాగిన జీవన గమ్యం (కొన్ని నిర్వచనాలు); నగరం యొక్క విచిత్ర స్థితిని తెలియ పరుస్తూ, అంతర్లీనంగా కాంక్రీటు అరణ్యంలా మారిన నివాస ప్రదేశాలను అవి అచేతన మవుతున్న స్థితిని చెప్తూ (నగరంలో); విద్యార్ధుల అలవికాని పని వత్తిడి నేపధ్యంలో వారు ఎదుర్కొంటున్న మానసిక నిర్వేదాన్ని హింస ధ్వనిగా మ్రోగిస్తున్న సమాజ విచిత్రిని (ఆత్మా హత్యల ఋతువు); మనిషిలో గూడు కట్టు కొన్న నిర్వేదం ఎలాంటిదో చెప్తూ(అసంతృప్తి); మనుషులు మధ్య సంబందాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఎంతో సరళ పదాల తో సున్నితపు భావాలతో వ్యక్తీకరించిన విదానం (కలవ డాన్ని గురించి); గుంటూరు సీమ్మిరబకాయ రోషాన్ని దళారుల దగాకోరుతన్నాన్ని మిరపకాయ 'కోరు' కున్ననంత ఘాటుగా స్పందించిన మాటల విన్యాసం (కొరివి కారం).

ఉప్పెన జేవితాలను చిద్రం చేసిన కల్లోలాన్ని దుఃఖ కెరటాలుగా కళ్ళకు కట్టేట్టు వివరించిన సజీవ దృశ్యం (తీరాన్ని తాకిన దుఖం) ;చరవాణి ఎలా మానవ సంబంధాలను చరమ గీతం పాడుతోందని వివరించిన తత్త్వం (సెల్ గోడలు) ;నిరాశ నిస్పృహ లని మాని రేపటి సూర్యోదయాన్ని చూడాలి అంటూ ప్రభోదం కాంతి వెతుక్కున్న ఆశల బింబం (ఒంటరి దీపం) ; మనసును కాల్చేస్తున్న మౌనం తో మౌన జీవి, పేలుతున్న మాటల తూటాల మనిషికి గల నిరంతర ఘర్షణ వాటి సారుప్యత అసమానతలను బేరీజు వేసిన అక్షర విస్పోటనం (మౌన విస్పోటనం)  ;స్వచ్చ మైన గ్రామీణ వాతావరణపు మాటలను పలకరింపుల ఆప్యాయ తలను  గుర్తు తెస్తూ, వారి జ్ఞాపకాలను తట్టి లేపి, పల్లెలో విహరింప చేసి అవి అంత రించి పోతున్న వైచిత్రి (అంత రించి పోతున్న జాతి) ;జ్ఞాపకాల చెట్టు ను నేటి ప్రస్తుత జన జీవనానికి ప్రతీకగా మలచి, దానిని చిన్ననాటి స్మృతులతో అన్వయించి, నేటి గ్రామీణ పరిస్థితిని అత్యంత సహజత్వంగా అంతే ఆర్ద్రతల మేళ వింపుగా మలచిన కవి హృదయం (జ్ఞాపకాల చెట్టు).


పట్టణాలు పెరిగి పోతూ పల్లెను ఎలా మింగే స్తున్నాయో చెపుతూ, అన్నం ఇచ్చే పంట పొలం ఆక్రందనను ఆర్ద్రంగా, ఓడిన తనాన్ని నిర్వేదంగా చెప్పుకొంటున్న దైన్య హస్తాల ఆర్త నాదం (దురాక్రమణ) ;కడుపులో పెట్టుకున్న అగ్ని గోళం మరణ కారకం కాగా, వీడ్కోలు చెప్తూ నిలిచిన చోటును జ్ఞాపకాల దొంతరగా చేస్తూ, నీడనిచ్చే చెట్టుగా కొత్త ఊపిరి ఊదాలి అంటూ తన బాధను ఓదార్పుగా మలచిన నేర్పు (మిత్తువ) ; ఇన్ని అకృత్యాలు చేసిన వాడు విజేత ఎలా అవుతాడు అంటూ ప్రకృతి మీద దాడి చేసిన వాడిని నిగ్గదీసి శపించిన వైనం (విజేత);పచ్చని పంట పొలాలుగా, నాగలి స్పర్సతో, కోడె గిత్తల పాద ముద్రలతో పులకలు పొందాల్సిన నేల ముక్కలు ముక్కలుగా కోయ పడి ద్వంస మవుతున్న రీతి (వామన పాదం) ; భూఆక్రమణన నేపధ్యంలో సమిధ లవుతున్నసామాన్య జీవుల జీవితాలను ప్రస్తావిస్తూ సాగిన రచన (బులెట్) ; ప్రపంచంలో ఎలాంటి ఉన్మత్తుల నైనా, ఉన్మాది పనుల నైనా ఎదిరంచే సత్తా, తెగింపు, దైర్యం ఒక్క అక్షరం అనే ఆయుధానికే వున్నా యంటూ ఎంతో ఉత్తేజంగా మలచిన అక్షర పధం (అక్షరాలు) .
  విత్తిన విత్తు యొక్క ఆకాంక్ష ఆక్రందన గా మారి, నాలుగు దోసిళ్ళ నీటికి అలమటి స్తున్నది మొక్కగా మొల కెత్తి జనావళి ఆకలి తీర్చడానికి, దాని నిస్వార్ధ తత్వాన్ని ఎంతో చక్కగా మలచిన తీరు (కురవని చినుకు కోసం) ; విశ్వంలోని శూన్యత ను వస్తువులుగా నింపాలనుకుంటు, ప్రకృతుని పరిహాసిస్తున్న ప్రస్తుత మానవ జాతి దమన నీతిని ప్రశ్నించిన విధానం (శూన్య దేహం) ; రచన లు చేయటం ప్రవృతి అయిన రోజుల్లో కవి మనస్సు ఎక్కడ సందర్భాలలో తనను తను చూసు కొంటాడో మరల రచనలకు స్ఫూర్తి పొందు తాడో తెలుపుతూ (కొన్ని విరామాల మధ్య) ;కొత్త దనాన్ని ఆహ్వానిద్దామంటూ స్ఫూర్తి దాయకంగా సాగిన పద లాలిత్యం (కొత్త కొత్తగా) ; నిప్పు లాంటి నిజం కావాలంటూ సమకాలీన ప్రసార మాధ్యమాల మీద విసిరిన విస్స్పూట లింగం (నా దేశపు నాలుగో స్థంబం) ; చిన్నమ్మ అనారోగ్య స్థితిని ఆమె పడ్డ వేదన భరిత జీవ యాన పయనాన్ని వ్యక్తీకరిస్తూ కవి చూపిన ఆర్తి ఆర్ద్రతల మిళిత యదార్ధ జీవితం, చేష్టలిడిగిన అనుబంధం (అచేతనత్వం).

                    మృత్యువుకు ఆహుతి ఐన మిత్రుడి జ్ఞాపకాల ను నెమరు వేసుకొంటూ, అతని తాలూకు స్నేహ మాధుర్యాన్ని తలచు కొంటూ తమను ఇలా వదిలి వెళ్ళావులే  కాని నీ ముద్రలు  చెరగనివ్వదు లోకం అంటూ సాగిన మిత్ర జ్ఞాపకం (మో కి) ;జీవితాన్ని రాచ పుండు తో పోరాటం చేసి నింగి కేగిన తన తోడు కై శూన్యత ఆవరించిన ఆయన వంటరి తనానికి ఆమె జ్ఞాపకాల స్పర్శను అందించాలని తపించిన హృదయం (ఆమె లేదు) ; తనను తను కవిగా ప్రతిపాదించుకొంటూ కవితా వస్తువులకు అక్షరాలను తొలచి విజయం  సాధించిన కవితా పుంజం (పురా శకలం) ; కలల విహారానికి ఊయలలు ఊగుతూ విశ్వాసపు ఊడల్ని పట్టుకొని శిధిలాలను శిఖరాలను కాంచిన కవి ధోరణి (శిధిలాల నుండి శిఖరాల వరకు) ;పచ్చని పంటకు, ఆకలి తీర్చే అన్న పూర్ణ ఘనతి పొందిన ముచ్చబోడు కంకర బీడుగా మారిన తీరును జీవన ఉనికిని కోల్పోయిన విధానాన్ని హృద్యంగా వినిపించిన యాంత్రిక మాయ (ముచ్చబోడు) ; ఎంతటి దార్సనికుడి కైనా కలిగే వైరాగ్యపు నీడల జాడలు విశదీ కరించిన కవిత (పాద జాడల కోసం) .
  విద్వేషాలు రగిల్చిన నాగరికులు మిగిల్చిన సమాజంలో సామాన్యుల జీవనం సాగించేదుకు తోడ్పాటు కావాలంటూ ఏదో విధంగా పయ నిన్చాలంటూ బోధన (లేపనం);ఎగిరిపోయిన మిత్ర జీవి గతాన్ని జీవితాన్ని జ్ఞప్తికి తెస్తూ తన వ్యాపకాలు ఎలా చిన్న పోయాయే తెలుపుతూ నివాళి అందిస్తూ (పక్షి ఎగిరి పోయింది) ; కల్సి వుంటే కలదు సుఖం, మన మంతా ఒక జాతి పక్షులమే అంటూ ఎందుకు నడమంత్రపు సంఘర్షణలు అని ప్రశ్నిస్తూ మనిషి మనుగడకు సూత్రాలు వల్లే వేస్తూ (విడి విడి గా నే) కవి గారు ఒకటేమిటి సమస్త పల్లె మూలాలను , ప్రపంచీకరణ నేపధ్యమవుతున్న పల్లెల ద్వంసాన్ని ఆమూలాగ్రం స్పృశించి తరించారు. మమ్మలను గత ,వర్త మాన విషయాలతో ఓల లాడించారు. మీ విస్తృతి కవితా ధారకు హృదయ పూర్వక అభినందనలు. సంచికలో కొన్ని పద ప్రయోగాలు నన్ను ఆకట్టు కొన్నాయి అవి అదృశ్యమైన మనిషి ఆకుల మధ్య ప్రత్యక్ష మవుతాడేమో; తడిచి గర్భ మావ్వాల్సిన మట్టి; రాత్రిని తాగుతూ చీకటిని నంజు కొంటున్నాను; ఒకానొక శూన్యం కాని శూన్యం; మణి కర్ణిక ఘాట్; పోసుకోలు గింజలు; బిటి మాటల విత్తనాలు; దుఖపు కణాల మూలుగులు, దేహ సంబాషణలు ; మనష్య యంత్రాల తయారీ ;మొదలగునవి. మీ కవిత సేద్యం నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ ... ఒక గొప్ప పుస్తకం చదివాననే ఆనందంతో, ఆనందం పంచిన మీకు కృతజ్ఞతతెలుపుతూ...ధన్యవాదాలు.... భవదీయుడు ....డా మక్కెన శ్రీను

No comments:

Post a Comment