Friday 17 April 2020

nissabdha sankham


నిశ్శబ్ద శంఖం
డా .. మక్కెన శ్రీను
క్షణ కాల కలయిక  విదిల్చే  
నవ నాగరిక ప్రపంచ మకిలం 
మనో వికార చీడలా దవాలనం!
పీల్చే ఊపిరి మాలిన్యమై
ముసిరే కారణాలు మిగిల్చే
మరణ  ఘోష నెలాపను?
కరోనా  కోరల్లో చిక్కుకున్న
జీవన్మృత  జన సమూహపు
అచేతన చేష్టనెలా వీక్షించను?
అనుమానం ఆలింగనమై,
అమానుష కాలుష్య మరకై
అనారోగ్యం ఆవరించిన వేళ..!
అవాహనైన కొంగ్రొత్త భూతం
మనిషి భవిష్య మనుగడకే
మరణ శాసన మయ్యేనా!
దేశంలో చొరబడే ముష్కరులు...
హద్దులు దాటే మూకల క్రీడలు
శత్రు సంహారమే సమాధానాలు   
జ్వలన రుధిర తారల్లా జవాన్లు
జాతి పతాక పౌరుషమవుతారు   !
దేహాన్ని ఆశించే వినాశక క్రిములు
ప్రతి రక్షకాలుగా తెల్ల రక్త కణాలు
పోరాడే తత్త్వం ఎదుర్కొనే వీరత్వం ..
క్షణ క్షణం గస్తీ... నిరంతర కుస్తీ 
దేహ రక్షణకై నిత్య యుద్ద ధర్మం!
కణ సరిహద్దుల కాపలా  విధులు
అడ్డుగోడై ఆక్రమణల అణిచివేత
దేహ రక్షణ మాదంటూ  కవాతు !
ఆరోగ్యానికి  మేమంటూ  భరోసా
దేహంలో కణమే రక్షణ నాదంటే
కణాలే దేహమైన జనమే మనాలి!
దేహంపై చూపేసిన  శత్రు అంతం
శుచి శుభ్రతే  అంతః కరణ ధ్యానం
సామాజిక దూరం ఆధ్యాత్మక శంఖం  
గృహ నిర్బంధమే  నిశ్శబ్ద  యుద్ధం
నిశ్చల ఋషిత్వం మౌన హోమం
నిర్మల హృదయ శబ్దాలే శతఘ్నులు
కుహనా కరోనాల కాలం చెల్లాల్సిందే
దేశం జెండా గర్వంగా ఎగురుతుంటే
దేహపు గుండె సలాం అనాల్సిందే!
****

adavi pilusthondi


                                  అడవి పిలుస్తోంది !                                                     
                                                                     డా మక్కెన శ్రీను
అతనొకప్పుడు  అచ్చంగా అక్కడి వాడే
గుంపులో వొంటిగా  సంచరించిన  వాడే
ఒంటరి వాడినయ్యా నంటున్నాడేంటొ !
చెట్టు చేమ చెలిమితో సొమ్మసిల్లిన వాడే
ఆకులు  అలములు తిని ఆవులించినాడే 
రోజు వాడికి ఏం గుబులు పుట్టిందో మరి 
రెండు రాళ్లు చేతిని బట్టి మంట రాజేసే 
రేగిన  అగ్గి  మెదడును దహించిందేమో
తెలివన్నది తెలియనోడు తుంటరయ్యే
ఆలోచననన్నదేలేనోడు  ఆటవికుడయ్యే 
సహవాసం మానేసి సాన బెట్ట  మొదలెట్టే
వెదురును చీల్చి విల్లని  వింటిని ఎక్కుపెట్టె 
వెంటాడం వేటాడటం వంట నేర్చాడులే 
గానెం తలకెక్కిందో నాకేంటనే తెగింపో
అడవిని దాటి నాదంటూ భూమ్మీద  పడ్డాడు
దున్నేసాడో ..దొర్లెసాడో .. దోచేసాడా ..తెలియాలా !
వేగంగా  ఏపుగా  పండే  పెరిగే  విత్తనం కోరికయ్యె
పిచికారీ రసాయనాలు పంటల  విజ్ఞాన మయ్యే
ఈత నేర్పిన చేప  కమ్మటి  పులుసు ముక్కయ్యే
వేగం చూపిన జింక పిల్ల నోటిన  జుర్రే  బొక్కయ్యే
ఎగరడం తెలిపిన  పక్షి  వేపుడు  ముక్కయ్యే
వెంట తిరిగిన  విశ్వాసం  కాపలా  కుక్కయ్యే
అరచేతిలో స్వర్గం వీడలేని ఆటవిడుపయ్యె 
జడలు  విప్పిన  ధార్మికత ధరావత్తు మింగేసే
గూడు అల్లే పిచ్చుక తోడు గోడు  లేక కడతేరే
పచ్చని పుడమి  పచ్చి పుండులా  తల్లడిల్లే  
ఎన్నిసార్లు చెప్పలా అడవి ఆకాశం తగ్గమని
మనిషి మనిషులా యెన్నడు  తిన్నగా బతికే
మతమని కులమని రోజూ విడిపోవడంలా
ప్రాంతమని దేశమని గొంతుక గీ పెట్టడంలా
నేడేదో  కొత్తగా వింతగా జీవిస్తున్నానని  గావుకేక
కనిపించని భూతమొకటి వెంటాడుతుంది
రాపిడి నేర్పిన చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కో
ముక్కలు మెక్కిన నోటికి గుడ్డ అడ్డం పెట్టుకో
మొక్కకు  కూసిన్ని నీళ్లు పోసి ఋణం  తీర్చుకో
పక్షులకు  రవ్వంత నూక విదిల్చి కూతలు వినుకో
ఏమారి ఎడారీ లోకి రాకు ఊపిరాగి  వీడి  పోతావ్
ఓపిక తో ఇంట్లోనే వుండు అడవి పిలిచే  రోజుంది
అనాలోచన అది చెయ్యదులే .. ఆదరణే అనాదిగా ..!
                             *****