Sunday 31 March 2019

234.నా " గోరంత కవిత " నానోల పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-19-ఉయ్యూరు-మందు బిళ్ళ ల్లాంటి డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు

మందు బిళ్ళ ల్లాంటి డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు

మందు  బిళ్ళ ల్లాంటి  డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు ‘’
క్లుప్తత నిర్వచనాలకే కాదు కవిత్వానికీ బాగా వర్తింప జేస్తున్నారు కవులు .ఆకాశాన్ని అద్దంలో చూపిస్తున్నట్లు కొండ౦త భావాన్ని కుదించి అందంగా చెబుతున్నారు .ఇప్పటికే 6 రచనలతో లబ్ధ ప్రతిష్టులైన డా .మక్కెన శ్రీను తాజాగా 2019కానుకగా 500 ల  ‘’గోరంత కవిత ‘’నానోలను ఆంద్ర పాఠకులకు అందజేశారు . ఆయన పంపిన ఈ పుస్తకం ఈ ఉదయమే నాకు అందగా వెంటనే చదివాను . అప్రతిభుడనయ్యాను .చేయి తిరిగిన మహాకవి స్పర్శ కనిపించింది .దేనికదే సాటి గా ఉన్నాయి .ఎంత పెద్ద జబ్బైనా  చిన్న మందు బిళ్ళతో నయం చేసి గుణం కలిగించవచ్చు .ఆ లక్షణం  ఈ నానోలలో అంతటా గోచరించింది .ఆయనే నిర్వచించినట్లు ‘’నాలుగు –పాదాలు –నాలుగే –పదాలు ‘’నానో భావాలు ను చక్కగా పాటించి మెరుపులు ,వెలుగులు ,చమత్కారాలు ,ఆలోచనలు సృష్టించారు .గోరంత దీపం కొండంత వెలుగు కదా .అలా వెలుగులీనిన నానోల సమాహారం ఈ పుస్తకం . వివరణ అక్కర లేని నానోలివి . నోట్లో వేసుకొన్న  ‘’మెడిసిన్ పిల్ ‘’లా తక్షణ రిలీఫ్ ఇస్తాయి .అందుకే అందులోని కొన్ని నానోలు మీకోసం –
1 –నానో- గోరంత –భావం –కొండంత
2-తొలి –బడి –అమ్మ- ఒడి
3-చరవాణి –సంభాషణ –నరవాణి-సంహారం
4-తల్లి –పుట్టుక –తండ్రి –నడత
5-కంటి –దానం –లోక౦ –వెలుగు
6-నోట్లో –గుట్కా –మరణపు –చిట్కా
7-అమ్మ –ఆత్మ-నాన్న –జీవాత్మ
8-అమ్మ –లాలన –నాన్న –పాలన
9-ప్రేయసి –మధురం –ఒడి –సాంత్వనం
10-అచ్చు –సొంపు –హల్లు –ఒంపు
11-పఠనం-నిత్యం –వికాసం –సత్యం
12-రక్తం –ప్రసరణ –జీవం –ప్రజ్వలన
13-ఆర్ధికం –తాత్కాలికం –హార్దికం –శాశ్వతం
14-మండే –చెట్టు –ఎండే –ప్రకృతి
15-ఓర్పు –కష్టం –విజయం -ఓదార్పు
16-కష్టం –చేదు గుళిక –ఫలితం –తీపిమాత్ర
17-నీకు –నీవు –అన్వేషణ –జ్ఞానం
18-పాదాలు –నానీలు –పదాలు –నానోలు
19-విత్తనం –అంకురం –విత్తం –అంకుశం
20-మొగుడు -ధనాత్మకం –పెళ్ళాం –రుణాత్మకం
21-వాకిట –నాగలి –ఆకలి –మాయం
22-ఆకాశం –కవిత్వం –నక్షత్రాలు –నానోలు
23-ప్రకృతి -వీక్షణం –ఆకృతి –దర్శనం
24-జీవి –అండపిండం –విశ్వం –బ్రహ్మాండం
25-ఆదర్శం –వల్లించేది –కర్తవ్య౦  –ఆచరించేది
26-ప్లాస్టిక్ –ఆవరణం –పర్యావరణ –భూతం
27-దేవుడు –సముద్రం –జీవుడు –కెరటం
28-గోమాత –దీవెన –భూమాత –క్షేమ౦
29-కళ్ళ-తడి –మనసు –అలజడి
30-ఆలుమగలు –అనురాగం –ప్రేమ –లతలు
31-సమాజ –శిలలు –వీధి –బాలలు
32-కసువు –దివాళా-పశువు –కబేళా
33-శృంగారం –శ్రీనాథుడు-సంసారం –స్త్రీ నాథుడు
34-నుదుటి –విభూతి-దైవత్వ –అనుభూతి
35-నేడు –వ్యవసాయం –రైతు –ఎద గాయం  
36-పలుకు –సిద్ధాంతం –అరుపు –రాద్ధాంత౦
 37-ప్రశ్నల –నిఘంటువు –శ్రీ శ్రీ –మహా ప్రస్దానం
 38-విశ్వ వీధి –పూదండ –సినారె-విశ్వంభర
39-కవి –త్రాసు –భావన –తూనిక  
40-భావం –జీవం –భాష –సజీవం
అందమైన’’ అక్షర బంతి’’ముఖ చిత్రం తో  పాలనురుగు పేపర్ పై ముద్దులొలికే ముద్రణతో విడుదలైన  డాక్టర్ గారి నానోలు చప్పరించి ఉపశమనం పొందండి .తాత్విక, బౌద్ధిక ,మానసిక లౌకిక , శాస్స్త్రీయ ,ప్రబోధాత్మక ,చిత్తశాంతి జనక ,కవితాత్మక నానోలను ఆస్వాదించి ‘’గోరంత కవిత ‘’లలో కొండంత వెలుగులు దర్శించండి .
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-19-ఉయ్యూరు