Thursday 12 April 2018

206 mouna savvadi .... suryadevara ravikumar spandana




206.మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి
డా మక్కెన శ్రీను గారు పశు వైద్యశస్త్ర  శిఖామణి .అసోసియేట్ ప్రొఫెసర్,ప్రొఫెసర్  గా సుదీర్ఘ అనుభవమున్నవారు .ఆ వృత్తిలో ఉన్నా ,సరళ హృదయులు .సున్నిత మనస్కులు ప్రపంచ పోకడ కని పెట్టె సూక్ష్మ పరిశీలకులు .మనసులోని భావాలను కాగితం పై అందంగా హృద్య౦గా  చెప్పే నేర్పున్నవారు .కవితలతో హృదయాలను కదిలించి ఆలోచింప జేస్తారు .వ్యవసాయ నేపధ్యం నుంచి వచ్చిన వారు కనుక మట్టి వాసన గుబాళించే కవితలెన్నో రాశారు .చిద్రమైపోతున్న రైతన్నల బతుకులను ఇప్పటికే చక్కగా చిత్రించారు .వారి పుస్తకాలు నిరుడు నాకు పంపటం దానిపై నేను స్పందించి రాయటం మీకు తెలిసిన విషయమే .ఇవాళ అకస్మాత్తుగా ఉరుము ఉరమకుండా మెరుపు మెరవకుండా వారు పంపిన ‘’మౌన సవ్వడి ‘’నాదరికి చేరింది .కమ్మని కవిత్వానికి కేరాఫ్ మక్కెనగారు కనుక వెంటనే చదివేసి ,అందులోని నాకు అర్ధమైన విషయాలు మీకు తెలియ జేస్తున్నా ‘.
సమకాలీన సమస్యలను స్పృసించి రాసిన 36 కవితల సమాహారమే’’ మౌనసవ్వడి’’..ఈ సవ్వడి ఎప్పుడు వస్తుందో ఆయనే కవితగా తెలియజేశారు –‘’సమాజం లో ప్రశ్నించే అవకాశం లేక ,-గొంతులు మూగ పోయినపుడు –నిరంతరం శబ్దించే గుండె –మౌనం గానే సవ్వడి చేస్తుంది ‘’అనేదే తన ఈ పుస్తకానికి ప్రేరణ  అన్నారు .పాపాయిముందు పలకా బలపం నగానట్రా పెట్టి పట్టుకోమంటే ఈ శతాబ్ది ముదుళ్ళు’’చరవాణి’’నిముద్దాడితే రేపటి ప్రపంచ తీరు ఇదే అని ‘’గిలక్కాయ అవాక్కైంది’’అన్నారు .’’రేటు’’పుష్కలంగా ఉండే కార్పోరేట్ కాలేజి   కుర్రోళ్ళ ప్రపంచీకరణ భజన లో ‘’తెంగ్లీష్ యువత ‘’చిందు లేస్తున్నందుకు వాపోయారు .నూత్న వత్సరం లోనూ ‘’మొలకెత్తని ఆశల విత్తనాల ‘’ను చూసి పెదవి విరిచారు .వెళ్ళే ఏడాదిని ‘’స్వ’’గత ‘’మన్నారు .తెలుగు గడ్డ రెండు ముక్కలైనందుకు తల్లడిల్లవద్దని తెలుగు తల్లిని వేడుకొని ,’’నీ జెండా రెపరెపలు ధరిత్రి నిండా ఎగిరేలా ‘’శ్రమిస్తామని ప్రతిన చేశారు .
  బాపు బొమ్మను గురించి బాపురేగా ‘’సత్తి రాజు కుంచె ఆడితే తాండవమే –నటరాజు నర్తించు కుంచె యందే’’అని ఇంతవరకు ఎవరూ చెప్పని కవిత చెప్పారు .’’బాపు గీసిన గీతలు తెలుగు భాగ్య రేఖలు’’అని గొప్ప నిర్వచనం చేశారు .మరో అడుగు ముందుకు వెళ్లి ‘’తెలుగు వాడి గుండెల్లో రామాలయం నీవు ‘’అన్నారు .ఎవడో ఒకడు వచ్చి మార్పు సూచీ  మార్గ దర్శీ ‘’కావాలని కోరుకున్నారు .జీవితపు నడక అలుపు సొలుపు లేకుండా సహనం తో  ,గెలుపే గమ్యంగా సాగాలని హితవు చెప్పారు .పండే భూమిని అమ్ముకుంటే అమ్మను కోల్పోయినట్లే అన్నారు .చివరికి ఏమీ చేయలేక వైరాగ్యమావహించి ‘’మానవాళి మనుగడకు కొవ్వొత్తి నవుతా –సస్య సన్యాసిలా –జీవశ్చవం లా జీవిస్తా ‘’నంటారు పాపం .ఆశ ఆరిపోక ‘’ఎన్నడో సాలు దీవెన –రైతు వాసన? ‘’ఎదురు చూస్తున్నట్లుగా అన్నారు .
  ప్రయోగ శాలలు, పరిశోధనలు విరివిగా ఉన్నా వాటి ఫలితాలు ‘’ప్రగతి కాముక క్షేత్రానికందేనా””?అని ప్రశ్నించి ‘’’’నేటి సమాజ జన దైన్యాన్ని  ‘’అనవసర అజ గళ స్తన్యం ‘’తో పోల్చారు . గొప్ప పోలిక ఇది .’’ప్రతిభ ఉన్నోడే లోకాన స్వయం ప్రకాశం ‘’అని ప్రతిభను ప్రోత్సహిస్తేనే ప్రగతి ,సుగతి  అని చెప్పారు . .’’చక్రభ్రమణం లో జాతి సంస్కృతీ సంప్రదాయం వారసత్వమై’’సృష్టికి అను వంశికం అవుతుందని జెనెటిక్స్ సూత్రంగా చెప్పారు .నేడు మనిషికి ఉన్నఅత్యల్ప  విలువను ‘’మనిషితనం నేడు వాడి పారేసిన కాగితం ‘’అన్నారు..’’చులకన జలరుహ తంతువు చులకన దూదికణము ‘’అని అనంతామాత్యుని ఆవు దూడకు బోధించిన నీతి గుర్తొస్తుంది .
  ఎందుకింత శోధన వేదనా అని అడుగుతారేమోనని తానె ప్రశ్నించుకుని సమాధానంగా ‘’నాకు లేదిక్కడ శాశ్వత చిరునామా –నాకు నేను చెబుతున్నా ఇది నా వీలునామా ‘’ అంటూ’’ విల్లు’’ రాసి  మనమోహాన కొట్టినట్లు గా కొట్టి ‘’బుద్ధిగా బతకండి బుద్ధుడిగా మారండి ‘’అన్నారు శ్రీను గారు .మనిషి అస్తిత్వం పై రాస్తూ ‘’నేను నేనుగా లేనప్పుడు –పత్రాల్లోకెక్కా-అక్కడే ప్రశ్నకు గుర్తింపుగా ఉన్నా ‘’అన్నారు కృష్ణ శాస్త్రి లా.
‘’కర్షకుని చరిత్ర అముద్రిత పత్రం ‘’అయిందే  ‘’అని వ్యధ చెందిన రైతుకవి డా మక్కెన. ఆల్కహాలిక్ కాలం లో  శల్య  ,హృదయ గతమైన ‘’హాలికత్వం ‘’శ్రీనుగారిని ఎన్నడూ విడిచి ఉండలేదు .సస్యోపనిషత్ గా ‘’జలానికి జత కూడి విత్తన ఉద్దీపనం –విత్తన వృద్ధితో ఆహార ధాన్య అవతరణం –ఆహార శక్తితో పరిపుస్ట మనిషి జననం –జనన మరణ నిక్కచ్చి  సత్యాంకురం-నమ్మకం లేని జననం ధరిత్రి తిరస్కృతం  ‘’అని చెబుతూనే ‘’యుజేనిక్స్’’ను కూడా మిశ్రమం చేశారు .ఆయనను  ‘’కలుపు తీయాలా ?ఆకలికడుపులు నింపాలా’?అన్న ప్రశ్న  వేధిస్తోంది ’ –ఆయనే తనకు తాను భూమిని చూసి సమాధానం చెప్పుకున్నారు ‘’క్షమయా ధరిత్రీ ‘’అనేది తనకే కాదు అందరికీ ఆదర్శం అన్నట్లు తెలియ జేశారు .
 మంచిభావానాలు ,సమకాలీన చైతన్యం ,మనిషి హృదయం విస్తరిల్లటం లేదనే బాధ ,రైతు గతి ఇంతే అన్న ఆరాటం మక్కెనవారి కవిత్వానికి ప్రాతిపదిక .చక్కని పదాలతో అనవసర్ ఆర్భాటాలు లేని సూటి కవిత్వం తో మనకు చేరువౌతారు శ్రీనుగారు  .వారి మనసు సవ్వడి లో నాకు వినిపించిన కనిపించినదానిలో కొద్దో గొప్పో మాత్రమె చెప్పాను .మిగిలినకవితలు చదివి అనుభవించమని కోరుతున్నా .మరిన్ని కవితా సంపుటాలు వెలువరించాలని కోరుతున్నాను .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-18 ఉయ్యూరు 

205.మౌన సవ్వడి - సమీక్ష