Thursday 30 April 2015

97."కలరవాలు" pusthaka visleshana



"కలరవాలు"
ఆత్మకూరి రామకృష్ణ

            నేను హలికుడనే అంటూ అంతర్లీనంగా రైతు వాసనను కవితా అక్షర సేద్యంలో చొప్పించి భవిష్యత్తులో నేను పద రత్నాలను పండించా పోతున్నాను అంటూ తన అంతరంగ భావాన్ని వ్యక్తీకరించారు (నా మాట); నా కవితా ప్రస్థానంలో ఎందరిదో పాత్ర వుంది, ఎవరికని చేయను నా తొలి పూజ అంటూ వినమ్రంగా పేరు పేరు నా పుష్పాంజలి సమర్పించిన కలం ( తొలి పూజ ఎవరికి ..?); కవిత అనే పాప జననానికి రచయత అనే మాతృత్వం పడ్డ ప్రసవ వేదనను అక్షర బద్దం చేసిన పాళీ (కవిత పుట్టింది); చిత్ర కారుడు కవిత్వం రాద్దామని మొదలుపెడితే అనువంశికంగా అలవాటు పడ్డ చేతివేళ్ళు సిరా స్నానంతోకూడి ... మరి అది చిత్రమే ఐన విచిత్ర ఆనవాళ్లు (కవి 'చిత్ర' మయ్యింది); తన కవిత బాలకు పేరేమి పెట్టాలో తెలియక సందేహంతో మాతృత్వపు మైమరుపు సందిగ్ధ లను అనుభవించిన వైనం (తిక్క సందేహం)... ఇలా ప్రతి కవిత లోని తన మూలాలను మరువక ... కవిగా ఎదగాలనే తపన మరువక ఆమూలాగ్రం అక్షరాలే సుసుక్షిత ముద్రితా ముత్యాలుగా ... పుటలపై పరచిన చిత్ర కారుని కుంచాక్షరాలు ... కమనీయ ఆకృతి దాల్చి అక్షర కుటీరాలుగా మన ముందు కదలాడాయి.

           జీవన ప్రయాణం సాఫీగా జరగాలంటే ఎన్ని ఎదురు గాలులు వీచిన, అడ్డంకులు ఏర్పడ్డ, లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రభోదించిన గమ్యం (విరిగిన ఓడ); మనిషిని తన అవసరాలు, తన స్వార్ధం విధంగా మారుస్తాయో, తనకు స్నేహం, ఔదార్యాన్ని చూపిన నేస్తాన్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా చేసిన ప్రార్ధన (మరో ప్రపంచం); నీ స్నేహం తొలకరి జల్లులా నాకు జీవాన్నిస్తుంది అంటూ స్నేహ మాధుర్యాన్ని ఆవిష్కరించిన అక్షర మరియు దృశ్య మాలిక (కరగని స్నేహం); తెర చాపను, పిల్ల గాలిని, దర్పణాన్ని అంటూ మనో నిబ్బరం కలిగించి... నేనే నీవు, నీవే నేను అని చెప్పిన తత్త్వం ... సరళ పదాలతో, తనను తానూ పరిచయం చేసుకొన్న విధానం (నీవు ఎరుగని నేను); ఒక్క క్షణం చాలు ... చెలీ నన్ను నీ ఒడిలో ఓల లాడించ టానికి అంటూ వందేళ్ళ వనవాసమైనా, నిండు యవ్వనం ఇంకి పోయినా, నవ్వుల, చూపుల, మాటల, వాదన వీక్షణం లో సేద తీరి పోతానంటూ మైమరపించిన కవిత (ఒక్క క్షణం చాలు ..) ఇలా ప్రతి కవిత లో సున్నిత భావాలను సరళ పదాల తో భావ యుక్త చిక్కదనంతో కల గలపి, రంగ రించి మనస్సుకు హత్తుకునే విధంగా అక్షరాలను ఒక లయ బద్దంగా కదిలిస్తూ అక్షర కవాతు నిర్వహించారు.

           నిలువని మనస్సు నీ చుట్టూ తిరుగుతూ వుంది ... నీ వుత్తరం వాలిన క్షణం అన్ని మరచి కొత్త స్పందనలు రేపాయి. జాబు వ్రాయడానికి జవాబు నా దగ్గర లేదు ఎందుకంటె నా మనసూ నీ దగ్గరే ఉందంటూ సమాధానం ఇచ్చిన కవి హృదయం (జాబుకు జవాబు); తను కోరినది తన సొంత మైతే ఆనందం, గ్రుడ్డిగా మోజు పడితే అది ఆవేదనను కలుగ జేస్తుంది ... లిపి ఎరుగని మూగ భాష పిచ్చి మనసుకు చిత్రాల ఓనమాలు చూపెడుతుంది అంటూ ఆలపించిన మనసు (పిచ్చి మనస్సు); ఏది తెలియని రోజులలో నాకే సొంత మైన నీ హృదయం ... నీవు లేక ఎదురు చూసిన కళ్ళు, పెదవి విప్పి చెప్పలేని మాట, గీతాలుగా నీకై పాడు తున్నాయంటూ ఆర్ద్రంగా విలపించిన గీతం (గీతాలాపన); ప్రేమ ఒక్కరికో సంబంధించినది కాదు అది విశ్వ జననీయ మైనది, విశ్వ వ్యాప్తిత మైనది అనే విశాల దృక్పథం తో సాగిన ప్రేమ సందేశం (విశ్వ ప్రేమ); సాగ తీరాన ఎగిసే కెరటాలు, అలల మాటున దాగిన అంతరంగాన్ని ఆంతర్యాన్ని అందంగా విదీకరించిన సరళ పదాల సాగర మధనం (అందం అంత రంగం).... ప్రతి కవిత లో ను శబ్ద గాడత, పద కౌశల్యం, పద లాలిత్యం, పద సౌకుమార్యం దోబూచులాడుతూ అక్షరం వయ్యారంగా వొదిగినట్లు పుస్తకము పై ముద్రగా ఒలికినట్లు అనిపించింది.

           బ్రంహానంద, బ్రహ్మ యిక్యాలను ఉదహరిస్తూ ఆనవాళ్ళు, జ్ఞాపకాలు గుర్తు తెస్తూ అత్యంత సరళంగా జీవన సారాన్ని కవిత్వీకరించిన కమనీయం (జీవన సారం); సంధ్యా సమయంలో అవనిని ఆకాశాన్ని సంధి చేయలేని సూరీడు కోడె గిత్తల కాలి గిట్టల తో రేగిన ధూళి నే మేలి ముసుగుగా చేసికొని కనుమరుగై పోయాడంటూ ఎంతో సుందరంగా సూరీడు అస్తమయాన్ని అక్షరేకరించిన అక్షర కిరణం (మా ఊరి సూరీడు); కిరణం నీవై నన్ను సోకింది అప్పటి నుండే నీవై స్నేహం జనియించింది .. నీ ప్రతి భావన మధురం అంటూ స్నేహాన్ని కలకాలం పదిలముగా వుంచుకోమనే ఆలోచన చేసిన అక్షరం (ఎమ్మాయ చేసావో ..) మానసిక ఉల్లాసం పలు విధాలు ....అవి విలాసాల హర్షం అయ్యేది ..మదిని నవ వర్షంలా తాకిన నాడే అంటూ కురిసిన కవితా మేఘం (హర్షోల్లాసం); నెల రాజును కనులార కాంచాలనే ఆకాంక్ష .. ఆయుష్షు అసంపూర్ణమే అయ్యిందని కలత చెందిన పూబాల విన్నపాలు (విన్న పాలు వినవలె ...) కవితలలో అక్షరాలన్నీ కూడ బలుకు కొని పదాలుగా ... వాక్యాలుగా ... మారి కవిగారికి దాసోహమయినట్లు ... కుంచె కంటే కలాన్నిబలవంతుణ్ణి చేయాలని పూర్తిగా సహకరించి ... పుటలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగినట్లు కనిపించింది.
           మాయదారి మనస్సు కోరికలు మరిచాక కాలం చెల్లాక ఆగిపోతుంది ... గడియారం, కాలం, చెట్టు, ఆకాశం, నెల, నదులు, సూరీడు, చంద్రుడు, కోకిల, గుడి, అన్ని వాటి పని చేసుకొంతూనే వున్న్నాయి .. అదేంటో నా కాలే ఊరురా తిరుగుతుంది మనసు పెట్టె మెలికలకు అంటూ మనసు పయనం వివరించిన కవిత (మనిషి కోరిక 'కీ'); పసిడి కాంతులు చిమ్మే దీపపు చిమినీలా నాతో నీవు మధుర స్మృతిలా నిలుస్తావు గత స్మృతులు కొన్ని రేఖాచిత్రాలు మాత్రమే... కాని నీవు మాత్రం ఎప్పుడు నిలిచే ఉంటావు అంటూ తెలిపిన అక్షర సౌధం (దీపపు చిమినీ); రేయికి కల వాల్సిన పక్షుల జంట అంతరంగం ను చదివిన కవి ఎదురు చూపులు లలో స్వాంతన చేకూరేనా అంటూ విరహాన్ని చూపిన కవిత (బాటసారి); జీవితమే ఊగిస లాట ... జగతిన ఊగక వుండే గట్టు మాత్రమే ఎదురు చూస్తుంది జీవిత గమనాన్ని ... తెర చాప.. నావలా వర్ణించిన జీవిత సారం (ఊగిస); జీవన ప్రస్థానంలో మజిలి చేరకుండానే రాలి పోవు పూవులెన్నో అంటూ హృద్యంగా ఆవిష్కరించిన జీవిత సత్యం (పుష్పాంజలి).. మనిషి ... జీవితం .. మధ్య సాగే నిరంతర ఆధిపత్య ఆవేశాలు ... జీవిత చరమాకంలో .. జీవిత సారాన్ని వంట పట్టేట్లు చేస్తాయంటారు .. అలాంటి జీవిత సారాన్ని అలవోకగా .. అలసట లేకుండా ... అందంగా ... అక్షరీకరించారు కవి గారు.
                 కడలి కల్లోల మైనా నిబ్బరంగా ఆస్వాదించగల ప్రవృతి కొన్ని మూగ జీవులదంటూ ... ఎలాంటి విపత్కర పరిస్థితి నైనా చలించ కుండా గరిక లా మనో ధైర్యాన్ని చూపాలని అంత ర్లీనంగా ప్రభోదించిన కవిత (జారని గుండె); వలస జీవుల కేకలు జనారణ్యంలో నిరాదరణ పొందుతున్న నిజాన్ని పట్టణీకరణ చోద్యాన్ని నిజాయితీగా పలికిన కేక (పట్నం కోకిల); చింపిరి జుట్టు, చీకిన గడ్డం, శోకచిహ్నాలు ఇవేగా చిత్రకారుని ఆహార్యం ... ఐతేనేమి వెయ్యేళ్ళు నీ చిత్రాలలోనే బతుకు ... వెలసిన నీ బ్రతుకు చిత్రం వెలలేనిది ... అంటూ చిత్రకారుడు కవిగా అవతరించిన వేళ వారి వెతలను ఆర్ద్రంగా చిత్రీకరించిన కాన్వాసు లిపి (చిత్ర కారుని ఆవేదన); కళే కదా స్ఫూర్తి నిచ్చేది ..పర సంస్కృతి కి అడ్డు నిలిచేది ... వర్ణ చిత్రం వెనుకనున్న కళా కారుని మూగ ఆవేదనను ... కొత్త లోకాన్ని సృష్టించే సృష్టి కర్త భావాలను అక్షర కుంచెగా మనసుపై వేలాడ తీసిన వర్ణ చిత్ర విన్యాసం(కళా శక్తి);ఎన్నో గజాలు, ఎన్నో గ్యాలన్ల ముడి సరుకుతో ఆవరించికున్న ప్రకృతి కాంత కదా అవని అంటూ మనసును రంజింప చేస్తూ ... ప్రకృతి రమణీయతను దాని జననాన్ని కళ్ళకు కట్టి నట్టు వర్ణించిన చిత్త బ్రాంతుల అక్షర అంకురం (విశ్వ వి'చిత్రం ') ...సమాజ హితం, చైతన్యం, జాగృతి ... ఇలా ఎన్ని పదాలు చెప్పుకున్న ముందు గుర్తొచ్చేది కళలు, కళా కారులే ... అలాంటి కళా కారుల ఇజాలు నిజాలను బహిరింగ పరుస్తూ ... వారి అవసరాన్ని...వారి కష్టాన్ని..నిశ్కల్మశత్వాన్ని...ఎంతో నిజాయితీతో కవిత్వీకరించారు ప్రతి కవితలో.

          కళలను ఆస్వాదించండి, ఆరాధించండి .. కళా కారులను గుర్తించండీ అంటూ సాగిన హృదయ ఘోష ...అక్షర ధార (శిధిలాక్షరం) ; నాయకుడయ్యాక మమతను మరచి సంపాదనే ద్యేయంగా రాజ కీయాలను నడిపే ప్రజా ప్రతినిధుల నిజ స్వరూపం తెలిపే కవితాస్త్రం (వగరు రాజ కీయాలు); ఓటు విలువను తెలియపరుస్తూ ... బాలెట్ బంగారు పత్రం, ఓటు బ్రహాస్త్రం, వజ్రాయుధం, మంత్ర దండం అంటూ చైతన్య పరచిన కవిత (ఓటు విలువ); వేదికనెక్కి గొంతుకలతో కారు కూతలు కూసే వారి కేకల, సనుగుళ్ళ గొంతుకలతోనే సామాన్యుని ఆకాంక్షను సమాధి చేస్తారు అంటూ సాగిన నికార్సు నిజం (బహిరంగ సభ); ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎలా వున్నారు వారి దీక్ష ఎలా ఉండేదో తెలియ చెప్తూ వివరించిన అయ్యవారి చరిత్ర (మా బడి అయ్యా వార్లు).. ఇలా సాగిన కవితలలో ... కించిత్తు వేదన ... ఆవేశం ... వ్యంగ్యం .. వాస్తవికత .. లోకం తీరు .. మొదలగు అంశాలు తో బిగి సడలని వాక్య నిర్మాణంతో .. నిక్కచ్చి అక్షర బిగింపుతో బాధ్యత యుత దృక్పధం కనిపించింది

             వెన్నెల ...చిత్రాలు ,చిన్నెలు, విరహాలు, అందాలు అన్నీ నీకే సాటి .. చందమామ దాగుడు మూతలను ... వెన్నెల మహిమను అందంగా అలవోకగా కుంచె... కలం రెండూ కల్సి పోయి అల్లిన అలతి (నీకు నీవే సాటి); నాటి తరం చందురుడిని ఆస్వాదించిన వైనం ... నేడు చందురుడు మాట దేముడెరుగు దోమ కాటు మాత్రం నిజం అంటూ ఒకింత బాధతో కవిగారు చేసిన వర్ణన ... ఊరంతా కాచిన వెన్నెల అడవి (దారి) పాలు ... మామ ... చంద మామ నీవు తరానికి వేలిడిచిన మేనమామ అవును మరి అక్షర సత్యమే (పల్లె కాసిన వెన్నెలా ...) సాంప్రదాయ వ్యవసాయం మరచి, విడిచి నేల  మీద రొయ్య సాగు చేస్తున్న నడమంత్రపు అసామిల తిప్పుడు మీసాల తిప్పలు చెప్పిన నీటి సేద్యపు వెతల కైత (చెరపకురా ... చెడేవు!.); శ్రామికుడా ... ధర్నా, సమ్మె అంటూ నీకెందుకు ... ఫలితాన్ని పొదుపు చేసి దర్జాగా బతుకు అంటూ ప్రబోదించిన బోధ (విలాసాల దోపిడీ); సమాజం లోని ప్రజా స్వామ్య పెత్తం దార్లు ... సామాన్యులవెతలను ఆర్ధిక దృక్పధంతో తరచి చూసి, నాయకులపై వ్యంగ్యాస్త్రాలు వదులుతూ .. సామాన్యుని విధులు ఏమిటో తెలియ చెప్పిన లోక రీతి (రూపాయల చెట్టు)... పుస్తకంలో పుటలు తిప్పేకొద్ది కవి గారిలోని ఆహ్లాదం .. ఆవేశం పతాక స్థాయికి చేరి ... కొన్ని కవితలను ఉత్కృష్ట రీతిన ఆవిష్కరించారు .. అలాంటివి పైన ఉదహరించిన కవితలు .. ఒకదానికొకటి పోటీ పడుతూ మనసుని రంజింపచేస్తాయి...అలానే  ఆలోచింప చేస్తాయి.

          నేలని నింగిని అమ్మ నాన్నలుగా వ్యక్తీకరిస్తూ వారి మధ్య కీచులాట లెందుకు కలసి వుంటే కలదు సుఖం అంటూ అంతీర్లీనంగా సుసంపన్న దాంపత్య ఆవశ్యకతను అందులోని ఆనందాన్ని విదీకరించిన వివరం (నేల అమ్మ .. నింగి నాన్న ... !!!); ప్రకృతిని కాపాడుట నీ ధర్మం దానిని మరువకు ... అలా మరచిన నాడు ఏది మిగలదు ..మాన వాళి మనుగడకే నష్టం అంటూ సమాజ హితాన్ని కోరుతూ (స్వార్ధ ఛాయల లమిన ప్రకృతి); కార్య సాధనే ద్యేయంగా సాగితే దానికి కృషి తోడయితే ... విధి రాతలన్ని అనుభవాన్ని పెంచే రాతలని ... కృషి ఫలించే రోజు ఉంటుందని ... ఉత్తేజ పరచిన కవిత (విధి వంచిన విల్లు); లక్ష్య సాధకుడు దేనిని నేర్వక ముందుకు సాగుతాడు లక్ష్యం చేరేవరకు అంటూ ఆత్మ స్థైర్యం నింపిన కవిత (లక్ష్య సాధకుడు); అందాల ఆరపోత పరాయి చెంత కాదు ... నీ మగని చెంత ... నూరేళ్ళ జీవితానికి పసిడి పంటగా .జర దాచుకో ... కాంత రెచ్చ కొట్టే ధోరణుల, వస్త్ర ధారణ పోకడలను ఎత్తి చూపిన కవిత (పిల్లా ...! జర ఇనుకోయే ..!) .. . ప్రతి కవితలోనూ అంతర్లీన సందేశం..ఆత్మ స్థైర్యం నింపే ప్రబోధాలు .. ఉత్తేజ పరచే సుపదాలు .. ఎన్నో భావాల రంగరింపు ... సమాజ మేలుకొలుపుల...  కవితా తరంగాలు దోక్యతమవుతాయి.
             సంస్కృతి, సాంప్రదాయ విషయాలలో పరాకు వలదు వాటిని కాపాడాలంటూ సుతి మెత్తగా హెచ్చరిస్తూ భవిష్యత్తును రాయబారులుగా ఉండండంటూ ఆడ బిడ్డలలకు చెప్పిన కవిత ( ... నాయాడ బిడ్డా ....!); .. లచ్చమ్మా ఏమి నీవు కళా కారుల ఇంట ఉండటానికి నీకొచ్చిన ఇబ్బంది ఏమిటో ... కూసింత దయ చూపమ్మ అంటూ అంతర్లీనంగా కళా కారుల ఆర్ధిక ఇబ్బందులను కాదు దమనీయ పరిస్థితలను వివరించిన ఆర్ద్రత మిళిత మైన కవిత (లచ్చమ్మా ... నీ నెల వెక్కడమ్మా ...!?); విద్యా జ్ఞానం అవసరం దాని విశిష్టతను తెలియచెపుతూ సాగిన కవిత సడి (విద్యా జ్ఞానం); చదువు ఆవశ్యకతను దాని మహిమలను బోధించిన అక్షర కనికట్టు (చదువుకో ... నాన్నా!); యవ్వనం ఒక మత్తు అందులో ప్రేమ అనే మాయను దాతగాలిగితే నీ జీవితం గెలుస్తుందని చెప్పిన అక్షర సందేశం (యవ్వనం- ఆయుధం) .... ఇలా సాగిన కవితలలో పద సరళత వాక్య నిర్మాణంలో పరిణితి ... చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం ... సమజానికి ఒక మహత్తర సందేశం ఇవ్వటం లాంటివి గోచరించాయి .
              యవ్వనంలో సహజంగా పొందే ఉద్రేకపు కోరికల వైపు నడువకు...జీవిత భాగస్వామే
 
తోడు అనుకో అంటూ యువకులకు సరియిన దారిలో నడవండి అంటూ చెప్పిన కవిత (రంగు రెక్కల యవ్వనం); కాలాన్ని పణంగా పెట్టి వినోదమనే సాకుతో దూర వాణి సహవాసాన్ని కూడకు...కూసింత జాగురతతో వ్యవహరించుంటూ, నేటి ప్రసార మాధ్యమాల డొల్ల తనాన్ని ఎత్తి చూపిన కవిత (మయా దర్పణం); పుట్టింటిలో గారాల పట్టీలుగా బతికిన పడుచులు, మెట్టినింటి ఆరళ్ళను ఎలా ఎదుర్కొంటారో ఒక వైపు చెపుతూనే ... ఆడపడుచుల  సహన, దయార్ద్ర గుణాలను పుట్టింటి ఖ్యాతికి వారు పడే శ్రమను చెపుతూ ... ఇల వెలసిన కల్పవల్లులు అని కీర్తించిన అక్షర నిజం (మా ఇంటి ఆడ పడుచులు); స్నేహం గురించి వాటి పరిధులు పరిమితులు గురించి చేసిన విశ్లేషాత్మక కవిత (స్నే'హిత 'మెంత ...!?); పరిణామ క్రమంలో నాగరికత నేర్చిన మనిషి....కులం,మతంఅంటూ..అడ్డుగోడలుకడుతూ.. స్వార్ధ పూరిత ఆలోచనలతో సమాజము తిరోగమన దిశలో నడుపున్నాడు .. మనిషి మారడా? అంటూ ప్రశ్నించిన అక్షరం (మార్పు నోచని మనిషి) ... ప్రతి కవితలోనూ ఏదో ఒక అంశాన్ని స్పృశించి, మానవీయ కోణాలను ఆవిష్కరింప చేసారు ... కవితలన్నింటిలోనూ అక్షరాలు ఎంతో లయ బద్దంగా కూరి విషయాన్ని ప్రస్పుటం చేసాయి.

                ఒక నాటి పల్లె వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ వాటిలో ఇమడలేని నేటి తరం ప్రతినిధులను పరిచయం చేస్తూ సాగిన కవిత ... ఉహు కాదు ఇది ఒక చరిత (సెలవ లొచ్చాయి); ఎండ వేడిమి దాని పర్యవసాన పరిస్థితుల తీరు చెప్పిన కవిత (గ్రీష్మం చే ... ప్రశ్న); కవికి తన కవితలు అపురూపాలే ... వాటిని ఆదరించే పాటకుల నిర్ణయమే గీటురాళ్ళు అంటూ వినయంగా తెలిపిన కవిత (కవి'కి'తలు); తల్లి కడుపు పండి .. తండ్రి జన్మ ధన్యత చెందో... పుట్టిన యుగ పురుషుల కు నివాళి అన్నట్లు సాగిన కవిత ( .. మహితాత్మ ... సంభవామి!); మాట విలువను తెలియ చెప్పిన హిత భాషణం (మాటల మహిమలు); అపార్ట్ మెంట్ సంస్కృతి నాగరిక ప్రపంచంలో అందులోని నయా బతుకులను తేట తెల్లం చేసిన కవిత (మాయా హార్మ్యాలు); జనాభా నియంత్రణ గురించి వాటి పర్యవసానాలను విసదీకరించిన కవిత (జన నియంత్రణ అవశ్యం); అక్షరాన్ని నేర్పి సమాజములొ మంచి స్థానాన్ని కట్ట బెట్టిన గురువులుకు దక్షిణగా ఒసగిన కవిత పుష్పం (గురు దక్షిణ) .... ఇలా సాగిన కవితా ప్రభంజనంలో ప్రతి కవితలోనూ జనం కోసమే సమాజం కోసమే అక్షరాలను ఉపయోగించి కవిగా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు

నచ్చినపదప్రయోగాలు:ఆకలి గొన్న సాహితి లోకం, సిరా స్నానం, పల్లె గాసిన వెన్నెల .. వేలువిడిచిన మేనమామ, రుపాయల చెట్టు
నచ్చినకవితలు;నా మాట; విరిగిన ఓడ; జాబుకు జవాబు; విశ్వ ప్రేమ; జీవన సారం; మా ఊరి సూరీడు; బాటసారి; ఊగిస; జారని గుండె; విశ్వ వి'చిత్రం; నీకు నీవే సాటి; రూపాయల చెట్టు; మా ఇంటి ఆడ పడుచులు; మాటల మహిమలు
 
             నచ్చినచిత్రాలు:  నామాట(24పుట); తొలిపూజఎవరికి..?27పుట ;విరిగిన ఓడ (35 పుట); జాబుకు జవాబు (44 పుట); గీతాలాపన (48 పుట); విశ్వ ప్రేమ (50 పుట); జీవన సారం (54 పుట); మా ఊరి సూరీడు (56 పుట); విన్న పాలు వినవలె (62 పుట); దీపపు చిమినీ (66 పుట); బాటసారి (68 పుట); పుష్పాంజలి (72 పుట); జారని గుండె (74 పుట); వగరు రాజ కీయాలు (86 పుట); బహిరంగ సభ (90 పుట); నీకు నీవే సాటి (94 పుట); పల్లె కాసిన వెన్నెలా ... (96 పుట) చెరపకురా ... చెడేవు!.(98పుట); నేల అమ్మ .. నింగి నాన్న ... !! 104 పుట); స్వార్ధ ఛాయల లమిన ప్రకృతి (106 పుట); కొంచెం ఆలోచించు (110 పుట); లక్ష్య సాధకుడు (114 పుట); ... నాయాడ బిడ్డా ....! 120 పుట); లచ్చమ్మా ... నీ నెల వెక్కడమ్మా(122పుట);విద్యాజ్ఞానం124పుట);చదువుకో ... నాన్నా (126 పుట); యవ్వనం- ఆయుధం 9 128 పుట); రంగు రెక్కల యవ్వనం (130 పుట); మా ఇంటి ఆడ పడుచులు (134 పుట); సెలవ లొచ్చాయి (144 పుట); గ్రీష్మం చే ... ప్రశ్న ( 148 పుట); కవి'కి'తలు (152 పుట) .. మహితాత్మ ... సంభవామి (154 పుట) మాటల మహిమలు (156 పుట);! జన నియంత్రణ అవశ్యం (160 పుట); గురు దక్షిణ (162 పుట). ఇలా ప్రతి చిత్రం ఒక ముఖ చిత్ర మణిలా ... చిత్ర సామ్రాజ్య మహా రాణిలా మా కనుల ముంది కళ కళ లాడింది ... నీ చిత్ర కళా సౌందర్యానికి వేవేల వందనాలు.

                అమ్మ నాన్న సత్యం శివం అంటూ తన కవితల బిడ్డను వారికి అంకిత మిస్తూ తన జన్మ సార్ధకతను చేసికొన్నారు ... శ్రీ తుములూరి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారు, శ్రీ బి. యమ్. పి సింగ్ గారు పుస్తకం మీద వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర సత్యాలు ... మీ మాట గా చెప్పిన మీ జీవిత ప్రస్థానం బాగుంది. ముఖ చిత్రంమనోహరంగావుంది..పుస్తక విషయానికి సరిగా సరిపోయింది.ముద్రణ చాల అందంగా వచ్చింది. చివరగా శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారు అన్నట్లు గీతల మార్మికుడు గీతాలాపకుడైన  వేళ.... మనోహరమైన ప్రకృతిని మీపుస్తకరూపంలో మాముందు ఆవిష్కరించారు తొలి ప్రయత్నంలోనే ఎంతో సుందర మైన ... మంచి కవిత్వాన్ని.. సహజ సిద్దమైన చిత్రాలును మాకు అందించిన మీకు అభినందనలు .. కలరవాలు వేకువ తొలి సవ్వడే కాదు కవిగా తొలి కవిత్వపు మువ్వల ధ్వని ... చిత్ర లేఖనము లిపి విన్యాసము కల గలపి సుందర దృశ్య కావ్యంగా మలచారు.
               
               కవితలు, చిత్రాలు ఒక దానికొకటి పోటి పడుతూ నువ్వా నేనా అన్నట్లు సాగిన అక్షర దృశ్య యుద్ధం .. చిత్ర కారుడు కవి కూడా ఐతే కుంచేలే పాళీగా .... అక్షర చిత్రాలుగా చిందేస్తాయి అని నిరూపించారు కవి గారు.. మీనుండి ఇంకా ... మరెన్నో ... సుందర దృశ్య కవితా మాలలు రావాలని ఆశిస్తూ ... సెలవు