Tuesday 7 July 2015

109.అంతరాత్మ -కవిత చిగురు కల .. అంతర్జాల పత్రిక ప్రచురణ జూన్ 2015


అంతరాత్మ    
   ఆచార్య మక్కెన శ్రీను  9885219712
పచ్చని చెట్టు కింద కూర్చొని
చిగురుటాకులను చించావు
ముని వేళ్ళతో కొనలనే తెంపావ్
లేత చిగురలను చిదిమివేసావు
మల్లె తీగ దగ్గరకెళ్ళి మొగ్గను
కొన గోటితో నే గిల్లి తుంచావు
విచ్చకుండానే మోడయ్యింది
పరిమళాలు లేకుండా నేల రాలింది
స్వేచ్చగా ఎగిరే తూనీగను పట్టావు
కర్కశ పీడనంతో రెక్క విరిచావు
అచలన జీవిని చూసి చిందులేసావు
విహంగ ఆహ్లాదాన్ని హరింప వేశావు
చిటారు కొమ్మన చిలకే మయ్యింది
చిలకను తెచ్చి పంజరంలో పెట్టావు
పలుకులు నేర్పి పలుచన చేసింది
కులుకులు వదిలి కుయుక్తులు చెప్పింది
ప్రకృతి చెప్పే పాటాలు వద్దంటున్నావు
ఆకృతి లేని కృత్రిమాలే కావాలంటున్నావు
వికృతి దాల్చిన మనసును పెంచావు
జాగృతి మరచి మనుగడ సాగిస్తున్నావు
చేసిన తప్పులు ఎక్కడి కెళతాయి
నిను వెంటాడుతూ వెన్నంటి ఉంటాయ్
నీలో అలజడి  రేపుతూనే ఉంటాయి
ఆత్మ పరిశీలన అడుగుతూనే ఉంటాయి
నిబ్బరంగా నిలిపి ఉంచు నీలో సహనం
మనసంత పూర్తిగా నింపుకో సున్నితత్వం
ఒప్పులు చేసి నవ్వుతు గొప్పగా బతుకు
అంత రాత్మ ఎప్పుడు నీకు తోడు ఉంటుంది
                        *****