Monday 9 February 2015

75."మట్టి కుదుళ్ళు ఓ అద్బుత విశ్లేషణ-



                                          "మట్టి కుదుళ్ళు" పుస్తకం గురించి అద్బుత విశ్లేషణ-
ఆచార్య! "జననీ జన్మ భూమిశ్చ ..స్వర్గాదపీ గరీయసీ". జనని విషయంలో అలకలు పోయే వారున్న, జన్మ భూమిని చూసి పులకితులు కాని వారుండరు.ఉన్నాజీవన మృతులె. మీ మట్టి కుదుళ్ళు ఆమూలాగ్రం ఆస్వాదించాను .. అది నా బాల్యం, యవ్వనాల ప్రతిబింబం, ఇతరులు కవనాన్ని చదివి ఆనందించవచ్చు. వారికొక పుస్తకం, నాకొక జ్ఞాపకం. వెరసి జీవనం. మీరు ఉదహరించిన స్థలాలు, సంగతులకు నేను సశరీరంగా, సాక్షీ భూతంగా వుండటం ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఇందులో ఆటలన్నీ ఆడు కొన్నానని నా కూతురుతో నేను గొప్పగా చెప్పుకొన్నాను. మీ కావ్యంలోని ప్రతి పుటలో నన్ను నేను పోల్చుకొన్నాను. ప్రతి గురుతును అనుభూతించాను. అదుగదుగో ... జాతరని ఆసక్తిగా గమనిస్తున్న పరికిణీ పిల్లని నేనే. ఇదిగిదిగో ... ఇంటి ముందు ముగ్గులు దిద్దుతున్న పడుచును నేనే అంటూ ఆనందపడుతూ చిన్నపాటి కంపనకు గురయ్యాను ... జ్ఞాపకాల ఆనవాళ్ళు ...
జ్ఞాపకాల పొరలులోకి తొంగి చూస్తే .. తప్పెట శబ్దం విని బయటకు పరుగులు తీసిన వైనం ... లెక్కల లెక్క తేల్చలేక ముత్యాల (ఆయన కలం నుండి జాలువారిన అక్షరాలూ నిజంగా ముత్యాల సరాలే) వెంకటేశ్వర్లు గారి వద్ద మానేసిన శిష్యరికం .. దివిటీ తెస్తూ దేవుడికే దారి చూపే రోశయ్య కి భయం లేదనే సంభ్రమం. పశువులకి వైద్యం చేసే అదే రోశయ్య ని చూసి విభ్రమం. పలుకరాని దేవుడికీ, పలుకులేని జీవుడికి మీరన్నట్లు ఆశయ్య ( పద ప్రయోగం నాకు విపరీతంగా నచ్చింది) అని విస్తుపోయిన విషయం ... మంత్ర ముగ్ధుల్ని చేసే శ్రీ ని వాసా చార్యుల గారి వాక్పటిమకి నివ్వెర పోయిన వివరం. ఇప్పుడంటే ఊపిరి తీసికోకుండా గానాలాపనలు వింటున్నాము కాని మన గ్రామస్తులకి అర్ధ శతాబ్దం నుండే ఆయన అనర్గళ మధుర భాషణలు అనుభ వైకవేదమే. ఊరి జనాలకి కొద్దో గొప్పో తెలుగు బాష ప్రావీణ్యం అలవడిందంటే అది ఆయన చలువే. (తాత గారి పాద పద్మాలకు భక్తి ప్రపత్తులతో మోకరిల్లుతు) తరచి చూస్తే వేనవేల ఊసులు.
ఇక మీ రచనకు ఉత్తమోత్తమనే కొలమానన్నందించే తల మానికం "పల్లెటూరు". మార్పు లేని జీవితం ప్రవహించని నీటి గుంటతో సమానం. ప్రవాహంలో రాళ్ళు, రత్నాలు, నత్తలు, చెత్తలు కలవటం అతి సహజం. మనం సంధి కాలం లో ఉన్నాము కనుక మార్పు కంటగింపు గానే వుంటుంది. ఏమో? భావితరాల వారికి కనుల కింపుగా, మేలి మలుపుగా, మారు తుందేమో నని ఆశ పడదాం. మీ మట్టి పరిమళాన్ని తనివి తీర ఆఘ్రానహించాను అని సవినయంగా మనవి చేసుకొంటున్నాను. "రవి కాంచని చోట కవి కాన్చున్" అంటారు. కాంచటంతో పాటు కవికి లభించే కాంచనం .. తన భావాలను అందరితో పంచుకొనే వెసులుబాటు ఉండటం. అది మీలాంటి "మాన్యులకే" చెల్లుతుంది. నాలాంటి సామాన్యులకు చెప్పాలనే ఉత్తేజం ఉన్నా అది ఉత్త తేజమే. చదువరి తను పఠించే సన్నివేశాన్ని తనకు తానూ ఆపాదించుకొనే అవకాశం ఉండి ఉంటేనే. .. రచన కైనా రమణీయత .. కావ్యానికైనా కమనీయత. మీ రచన లోని ప్రతి అక్షరంతో మమేకమయ్యే భాగ్యం మన గ్రామస్తులకు అందించిన మీరు అభినంధనీయులు. మీ మట్టి కుదుళ్ళు మీ కొక్కరికే కాదు దేశ విదేశాలలో తమ ఖ్యాతిని చాటు కొంటు మహోజ్వలంగా వెలుగొందుతున్న అందరివేళ్ళు.
పుస్త కానికైనా ముద్ర రాక్ష సాలు దిష్టి చుక్క లాంటివి. మన ఊరి వారందరూ గొప్పగా చెప్పుకొనే చెరువు మధ్యలో గుడి (కోనేటిలో కోవెల) ఛాయా చిత్రాన్ని ముఖ చిత్రంగా ఉంచి ఉంటే బంగారం లాంటి మీ కావ్యానికి తావి అబ్బినట్లుండెదని (కేవలం) నా భావన. ముఖ చిత్రం మన ఊరి సంస్కృతిని ప్రతి ఫలించలేదని చిన్న అసంతృప్తి భాదిస్తున్న, నేనెందుకు అక్షరీకరించ లేక పోయానాఅనే దుగ్ధ వేధిస్తున్న, మీ సమకాలంలో ఉన్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. తుల తూచలేని జ్ఞాపకాంభుదిలో వెల కట్టకుండా ఓలలాడించి నందుకు వినమ్రంగా నమస్కరిస్తూఅరుణ చిన్నం w/oశరత్ బాబు.