Friday 17 April 2020

nissabdha sankham


నిశ్శబ్ద శంఖం
డా .. మక్కెన శ్రీను
క్షణ కాల కలయిక  విదిల్చే  
నవ నాగరిక ప్రపంచ మకిలం 
మనో వికార చీడలా దవాలనం!
పీల్చే ఊపిరి మాలిన్యమై
ముసిరే కారణాలు మిగిల్చే
మరణ  ఘోష నెలాపను?
కరోనా  కోరల్లో చిక్కుకున్న
జీవన్మృత  జన సమూహపు
అచేతన చేష్టనెలా వీక్షించను?
అనుమానం ఆలింగనమై,
అమానుష కాలుష్య మరకై
అనారోగ్యం ఆవరించిన వేళ..!
అవాహనైన కొంగ్రొత్త భూతం
మనిషి భవిష్య మనుగడకే
మరణ శాసన మయ్యేనా!
దేశంలో చొరబడే ముష్కరులు...
హద్దులు దాటే మూకల క్రీడలు
శత్రు సంహారమే సమాధానాలు   
జ్వలన రుధిర తారల్లా జవాన్లు
జాతి పతాక పౌరుషమవుతారు   !
దేహాన్ని ఆశించే వినాశక క్రిములు
ప్రతి రక్షకాలుగా తెల్ల రక్త కణాలు
పోరాడే తత్త్వం ఎదుర్కొనే వీరత్వం ..
క్షణ క్షణం గస్తీ... నిరంతర కుస్తీ 
దేహ రక్షణకై నిత్య యుద్ద ధర్మం!
కణ సరిహద్దుల కాపలా  విధులు
అడ్డుగోడై ఆక్రమణల అణిచివేత
దేహ రక్షణ మాదంటూ  కవాతు !
ఆరోగ్యానికి  మేమంటూ  భరోసా
దేహంలో కణమే రక్షణ నాదంటే
కణాలే దేహమైన జనమే మనాలి!
దేహంపై చూపేసిన  శత్రు అంతం
శుచి శుభ్రతే  అంతః కరణ ధ్యానం
సామాజిక దూరం ఆధ్యాత్మక శంఖం  
గృహ నిర్బంధమే  నిశ్శబ్ద  యుద్ధం
నిశ్చల ఋషిత్వం మౌన హోమం
నిర్మల హృదయ శబ్దాలే శతఘ్నులు
కుహనా కరోనాల కాలం చెల్లాల్సిందే
దేశం జెండా గర్వంగా ఎగురుతుంటే
దేహపు గుండె సలాం అనాల్సిందే!
****

No comments:

Post a Comment